Thursday 2 January 2014

Surya Chandras


అగ్నిర్మూర్ధా చక్షుషే చంద్రసూర్యౌ అని విరాట్పురుషుని గురించి ముండకోపనిషత్తు చెబుతుంది. విరాట్పురుషునికి ఆకాశం తల, సూర్య చంద్రులు నేత్రాలట.
  సమిష్టి స్థూలప్రపంచం విరాట్పురుషుని ఆకారం. లోకాన్ని వెలిగించే సూర్యచంద్రులు ఆయన రెండు కళ్లు అనడం సముచితం. అయితే బాహ్యాన్ని గురించే కాదు, జీవుని ఆంతర్యాన్ని గురించి కూడా పై మంత్రం సూచిస్తోంది. చురుకుగా, ఉత్సాహంగా తమకున్న యావచ్ఛక్తులన్నీ పైకి తీసి జీవితాలని అర్థవంతం చేసుకొనేవారిది సూర్యదృష్టి. బద్ధకంగా, సోమరితనంతో భోగలాలసతతో జీవితాలని గడిపేసేవారిది చంద్రదృష్టి. ఈ ప్రపంచంలోని రెండు రకాల వాళ్లూ ఉన్నారు. విరాట్పురుషుడికి ఈ రెండు రకాల దృష్టులూ కళ్లు.
            జీవితాన్ని ఇలా గడుపుకున్నాక ఏ రోజో శరీరాన్ని వదిలి జీవుడు ప్రయాణించాలి. మరణం అంటే స్థూల శరీరం రాలిపోవడమే. స్థూల శరీరం పడిపోయాక సూక్ష్మ శరీరంలో ఉన్న జీవుడు తన దృష్టిని బట్టి ఆయా లోకాలకు పోతాడు. అందుచేత మన శాస్త్రాలలో బ్రహ్మలోకాన్ని సూర్యుడు వెలిగించుతుంటాడని, ఇతర లోకాలని చంద్రుడు వెలిగించుతుంటాడని చెప్పారు. జీవితాన్ని సద్వినియోగం చేసుకొని జీవించినవాళ్లు బ్రహ్మలోకానికి వెళ్లి అక్కడినుండి క్రమముక్తిని పొందుతారు. ఇతరులు ఇతర లోకాలకి వెళ్లి తిరిగి పుట్టుతారు.
ప్రజలకి కథ ద్వారా నీతిని, భక్తిని బోధించే పురాణాలలో సూర్యవంశరాజుల చరిత్రలు, చంద్రవంశరాజుల చరిత్రలు ఉంటాయి. సూర్యునితో ప్రారంభమైన సూర్యవంశము శ్రీరామచంద్రునితో ముగుస్తుంది. చంద్రునితో ప్రారంభమైన చంద్రవంశం శ్రీకృష్ణునితో సమాప్తమవుతుంది. ఈ సందర్భంలో సూర్యచంద్రులు బాహ్యప్రపంచంలోని సాధకులని, అంతః సాధనచేసేవారిని సూచిస్తాయి.
            బాహ్యప్రపంచంలో శ్రీరామునిలా ధర్మంకోసం జీవించడం నేర్చుకోవాలి. అంతఃసాధనలో పూర్ణపురుషుడైన శ్రీకృష్ణుని చేరుకోవాలి. ఈ రెండు రకాల సాధనలలో అడ్డంకులు చిక్కులు అన్నింటిని వివరిస్తాయి ఆయా వంశ చరిత్రలు.
            హఠయోగంలో సూర్యచంద్రులు ప్రాణాయామ క్రమాన్ని సూచిస్తారు. కుడిముక్కు సూర్యనాడి, ఎడమముక్కు చంద్రనాడి. బాహ్యమైన ప్రాణాయామం కుదిరినాక, సూక్ష్మమైన ప్రాణాయామం  ఇడాపింగళ నాడులలో ప్రారంభమౌతుంది. పింగళ సూర్యనాడి, ఇడ చంద్రనాడి. ఈ నాడులలోని ప్రాణసంచారాన్ని అదుపులోకి తెచ్చుకొని సుషుమ్న నాడిలోకి పంపించి చక్రభేదనం చేస్తారు హఠయోగులు.
            ఇతర యోగాలలో సూర్యుడు అనాహత చక్రంలో ఉండే జీవభావం. చంద్రుడు ఆజ్ఞాచక్రంలో ఉండే వాసనలు. బాహ్యప్రపంచంలో సూర్యునివల్ల చంద్రుడు వెలుగుని పొందితే, అంతరంగలో చంద్రునివల్ల సూర్యుడి వెలుగు ప్రభావిత మౌతుంది.  వాసనలు ఎలా ఉంటే జీవుని వ్యక్తిత్వం అలా మారుతుంది.
            హృదయంలో సూర్యుడు, ఆజ్ఞాచక్రంలో చంద్రుడూ కాక, బ్రహ్మరంధ్రం స్థానంలో చంద్రరేఖ రాజరాజేశ్వరీదేవి ఉన్నదనీ, ఆమె ఉండే స్థానాన్ని జ్యోత్స్నామండలం, సుధాసాగరం అంటారనీ తంత్రశాస్త్రంలో చెప్పబడింది.
            ధర్మశాస్త్రాలలో సూర్యుని ఉత్తరాయణ, దక్షిణాయనాలని గురించి ప్రశంస ఉంటుంది. దక్షిణాయణ కాలంలో చనిపోయినవారు తిరిగి జన్మిస్తారనీ, ఉత్తరాయణ కాలంలో మరణిస్తే ముక్తిని పొందుతారనీ ఉన్నది. ఇది బాహ్య సూర్యునికి చెందినది. ప్రపంచములో జీవించే సమయంలో దేనితోను ప్రమేయం పెట్టుకోకుండా నిత్యము భగవంతుని గురించి ధ్యానిస్తూ, సాధనచేస్తూ గడపడం ఉత్తరాయణం (ఉత్+తర) అంటే పైకి అధిగమించి తరించడం. ప్రపంచములోని వ్యవహారాలలో సన్నిహిత సంబంధం పెట్టుకొని వాటిలో చిక్కుకుపోవడం దక్షిణాయణం (దక్ష్ అంటే పెంచుకోవడం). ముక్తి పొందడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ, అదే ధ్యాసతో మరణించితే అది ఉత్తరాయణంలో మరణించినట్లు. వాళ్లు తిరిగి పుట్టరు. భగవంతుని చేరుకుంటారు.
            ప్రపంచ విషయాలలో ప్రమేయం అమితంగా పెంచుకొని ఆ ధ్యాసతో దేహం వదిలివేస్తే, తిరిగి వెంటనే మరో శరీరంతో ఈ ప్రపంచంలో పుట్టుతారు.
            చేసుకున్నవారికి చేసుకొన్నంత మహాదేవ అన్న విషయాన్ని సూర్యచంద్రుల వర్ణనలు ఋజువు చేస్తాయి.
( వ్యాసము స్వామిని శారదాప్రియానంద గారి జ్ఞశిష్టంలోనించి గ్రహించబడినది)
           

No comments:

Post a Comment